గత ప్రభుత్వంలో విద్యారంగం సర్వనాశనం అయ్యింది – భట్టి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి..గత ప్రభుత్వంలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ప్రతి పేదవాడికి విద్యను అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్ లో రూ. 21వేల389 కోట్లు కేటాయించామని తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 500 కోట్లను కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్ మెంట్ తోపాటు స్కాలర్ షిప్ లను సకాలంలో అందజేస్తామని చెప్పారు. ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. నిరుద్యోగులకు వందశాతం ఉద్యోగాలు వచ్చేలా మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు.

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్ ఆలోచన చేస్తుందన్నారు భట్టి. దీని కోసం గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రల్లో అధ్యయనంకు అధికారుల బృందాన్ని పంపిస్తామని చెప్పారు. ఓయూ తోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించడం జరిగిందని భట్టి పేర్కొన్నారు.