ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు టిడిపి – జనసేన పార్టీలు మాత్రమే పొత్తుగా బరిలోకి దిగుతున్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు బిజెపి కూడా వాటితో పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటీకే టిడిపి అధినేత చంద్రబాబు తో బిజెపి అగ్ర నేతలు చర్చలు జరిపారు.

ఈ క్రమంలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్ టైమ్స్ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఏపీలో పొత్తులు త్వరలో కొలిక్కి వస్తాయి. ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. NDAలోకి కొత్త మిత్రులు వస్తున్నారు. కూటమిలోని మిత్రులను మేమెప్పుడూ బయటకు పంపలేదు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను బట్టి వారే బయటకు వెళ్లారు’ అని పేర్కొన్నారు.

అలాగే పౌరసత్వ సవరణ చట్టంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కాగా ఈ బిల్లు 2019లో పార్లమెంట్లో ఆమోదం పొందింది. ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని ఆయన అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్లో హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వం అందించడమే ఈ చట్టం ఉద్దేశమని ఆయన వివరించారు.