సైకిల్ గేరు మార్చి స్పీడ్‌ పెంచింది..ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తాము – చంద్రబాబు

ఏపీలో టీడీపీ స్పీడ్ పెరిగింది. మొన్న పట్టభద్రుల ఏంన్నికల్లో విజయ డంఖా మోగించగా..నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ విజయాలతో టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. మరోపక్క ఇతర పార్టీల నేతలు సైతం పెద్ద ఎత్తున టీడీపీ లోకి వస్తుండడం తో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఇకపై అన్‌స్టాపబుల్‌ అని చెప్పుకొచ్చారు.

శుక్రవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన టీడీపీ జోన్ -3 సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీకి బలమైన సైన్యం ఉంది అని, ఒక్కసారి గెలవాలని మీ మనసులో పడితే, గెలుపు టీడీపీ పార్టీది తప్ప మరొకరిది కాదు అని స్పష్టం చేశారు. టీడీపీ గట్టిగా నిశ్చయించుకుంటే వేరేవాళ్లు తట్టుకోలేరన్నది చరిత్ర చెప్పిన సత్యం అని పేర్కొన్నారు.

సైకిల్ గేరు మార్చి స్పీడ్‌ పెంచిందని ..ఎవరైనా.. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తామని స్ట్రాంగ్ గా హెచ్చరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైస్సార్సీపీ కి దిమ్మ తిరిగిందన్న చంద్రబాబు.. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో షాక్‌ తగిలిందని అన్నారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వాళ్లు తమకు ఓట్లేయరని ఆ పార్టీ నేతలే చెప్పేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మీద నమ్మకం లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం వల్ల 30ఏళ్లు వెనక్కు వెళ్లామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే జగన్ పని అని చంద్రబాబు దుయ్యబట్టారు.

దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని చంద్రబాబు అన్నారు. 23వ తేదీన 23వ సంవత్సరం 23 ఓట్లతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టాడని ఎద్దేవా చేశారు. ఎంతో కసరత్తు చేసినా.. చివరికి బొక్కా బోర్లా పడ్డారని విమర్శించారు. సంవత్సరం క్రితం బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభించాం. దాని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడుని కార్యకర్తలు, నేతలు భారీగా విజయవంతం చేశారు. తరువాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాం. పన్నులు, ఛార్జీలు, ధరల భారంతో ప్రజల్ని దోచుకుంటున్నారు. మున్సిపల్, ఆస్తిపన్ను. చెత్త పన్ను అంటూ పన్నులమీద పన్నులు వేస్తున్నారు. వాటిన్నింటిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్ని చైతన్యవంతం చేశారు. దాని ఫలితమే 108 నియోజకవర్గాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిందన్నారు.