వైన్ షాప్ టెండర్లలో ఒకే కుటుంబంలో నలుగురికి ఛాన్స్

మాములుగా ఓ వైన్ షాప్ టెండర్ వస్తేనే అదృష్టంగా భావిస్తారు. అలాంటిది ఒకే ఫ్యామిలీ లో నలుగురికి ఛాన్స్ వస్తే అంతకన్నా అదృష్టం మరోటి ఉండదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ క్యాసారం లో ఓకే కుటుంబానికి చెందిన అత్త, ఇద్దరు కోడళ్ళు, వారి ఆడపడుచులు మొత్తం నలుగురు కలిసి తొమ్మిది టెండర్లు వేశారు. కాగా ఈ టెండర్లలో నలుగురికి నాలుగు టెండర్లు దక్కడం వారిని సంతోషం లో పడేసింది. కొంపల్లి లోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ లో టెండర్లు తమకే దక్కాయని తెలియడం తో నలుగురు మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బి పోయారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2620 ఏ4 వైన్ షాప్ లకు టెండర్లు నిర్వహించగా 60,433 టెండర్లు నమోదయ్యాయి. శనివారం లాటరీ ద్వారా దుకాణాలను ఖరారు చేస్తున్నారు. వైన్ షాపులపైన టెండర్ దారులకు కమిషన్ కూడా 10 శాతానికి పెంచడంతో ఆశావాహులు భారీగానే పోటీ పడ్డారు.

వైన్ షాప్ టెండర్లకు దరఖాస్తులు చేసుకోవడానికి గురువారంతో గడువు ముగిసింది. రాత్రి 11 గంటల వరకు క్యూలో నిలబడి ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తంగా రూ.1208.66 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖ ఖాతాలో చేరింది. గతేడాది అప్లికేషన్ ఫీజ్ రూ.2 లక్షలు ఉండగా రూ.968 కోట్ల ఆదాయం వచ్చింది. అదే రుసుముతో ఈ ఏడాది కూడా టెండర్లకు ఆహ్వానించారు. ఇప్పుడు కూడా భారీగా ఆదాయం పెరగడంతో ఎక్సైజ్ శాఖ గల్లాపెట్టె గట్టిగనే నిండిందని అంటున్నారు.