పాకిస్థాన్ వైమానిక శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదుల దాడి

వరుస ఉగ్రదాడులతో సతమతమవుతున్న పాకిస్థాన్

terrorist-attack-on-pakistan-air-base

ఇస్లామాబాద్‌ః దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ చివరకు ఆ ఉగ్రభూతానికే బాధితురాలుగా మిగులుతోంది. ఇప్పటికే పలు ఉగ్రదాడులు పాక్ ను వణికించాయి. తాజాగా ఈ ఉదయం మరో ఉగ్రదాడి పాక్ ను భయభ్రాంతులుకు గురి చేసింది. పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలిలో ఉన్న పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వైమానిక స్థావంరంపై ఈరోజు ఉదయం టెర్రరిస్టు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మూడు విమానాలు, ఫ్యూయల్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. కౌంటర్ అటాక్ కు దిగిన పాక్ ఆర్మీ… ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులను కార్నర్ చేసింది.

కాగా, నిన్న కూడా పాక్ ఆర్మీ వాహనాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. రెండు వాహనాలపై జరిపిన దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గదార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు స్పందిస్తూ… దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.