నేటి నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు.. అరగంట ఆలస్యమైనా అనుమతి

వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం

అమరావతి: ఈరోజు నుండి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఆదేశించింది. అలాగే, ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ ప్రైవేటు పాఠశాలలు.. విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో హాల్ టికెట్లను నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, హాల్ టికెట్లపై హెడ్మాస్టర్ సంతకం లేకపోయినా అనుమతించాలని ఆదేశించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు.

ఏపీలో ఈ ఏడాది మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. వీరిలో 3,02,474 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష కోసం మొత్తం 3,776 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు అరగంట ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్నా సరైన కారణం చెబితే అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాగా, కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తొలిసారి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఈసారి ఏడు పేపర్లే ఉండనున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/