కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను, బీజేపీ ప్లెక్సీలను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని, నిరుద్యోగ మార్చ్ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసన కారులను పోలీసులు ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

TSPSC పేపర్‌ లీకేజీతోపాటు నిరుద్యోగుల బాధలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో బీజేపీ వరంగల్ వేదికగా నిరుద్యోగ మార్చ్‌ తలపెట్టింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ నిరుద్యోగ మార్చ్‌కు షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను విమర్శిస్తూ ప్రసంగాలు చేయరాదని హెచ్చరించారు. రోడ్డుకు ఎడమవైపే మార్చ్‌ సాగాలని, డీజే స్పీకర్లు వాడరాదని సూచించారు. అలాగే.. మార్చ్‌ సాగే మార్గంలో మధ్య మధ్య ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల కార్యకలాపాలకు ఆటంకం కలిగించరాదని షరతులు విధించారు.