జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గత ప్రభుత్వాల శాపం – మంత్రి కేటీఆర్

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గత ప్రభుత్వాల శాపమన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం 3,619 మంది లబ్ధిదారులకు జీవో నెం.58కింద పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి అభివద్ధి చేయలేదని.. అలాంటిది ఇప్పుడు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాళ్లను అసలు నమ్మకండి అని సూచించారు. చెత్త నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేస్తున్నామని , ఈ శుద్ధి ప్లాంట్‌ను రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించింది. కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్ డంప్ యార్డులో వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది.
నగరంలోని చెత్త సమస్యను తీర్చేందుకు జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డ్ అయితే పెట్టిండ్రు కానీ తదననంతరం ఏం చేయాలి? ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా ఏం చేయాలనేది పూర్తిగా అయితే చేయలేదు. చెత్తకుప్పలు పోసి, దుర్గంధం వచ్చేటట్టు చేసి ఆ సమస్యను మాకు వారసత్వంగా అప్పజెప్పి పోయిండ్రు. 2014లో వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ దీనిపై మొత్తం అధ్యయనం చేశారు. జవహర్‌నగర్‌లో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. అక్కడ వేల, లక్షల టన్నుల చెత్త డంప్ చేయబడి ఉంది. దీన్ని ఏం చేస్తే ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కలుగుతుంది అని ఆలోచించారు. దీనికి శాస్త్రీయంగా అత్యుత్తమ పద్ధతులు ఏం ఉన్నాయి? వాటికి అనుగుణంగా చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. మేం కూడా దీనిపై లెక్కలు తీసుకున్నం. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని లెక్క వేసిండ్రు. దానికోసమే ఈ ప్లాంట్ డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. ఇంకో వెయ్యి టన్నులు అయితే మూడు రెట్ల చెత్త అవుతుంది. అందుకే ఆలోచన చేసినం. ఆలోచన చేసి మూడు నాలుగు పనులు మొదలు పెట్టినట్లు కేటీఆర్ తెలిపారు.