ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పిటిషనర్ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. మహ్మద్ ప్రవక్తపై కామెంట్లకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో రాజా సింగ్, పోలీసుల తరఫున వాదనలు జరిగాయి. తొలుత 14 రోజుల రిమాండ్ అనే వార్తలు వచ్చాయి. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తర్వాత రాజా సింగ్ తరఫు లాయర్ తెలిపారు.

ఉదయం రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రాజాసింగ్ ను కోర్ట్ కు తరలించారని తెలిసి భారీ సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో వైపు ఎంఐఎం కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. కోర్టులో వాదనలు.. జరుగుతుండగా.. కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.