హమ్మయ్య..తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపింది. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడం తో రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఎక్కడిక్కడే వాగులు , వంకలు, చెరువులు , నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం తో రవాణా వ్యవస్థ స్థంభించింది. చాల చోట్ల రోడ్లు తెగిపోయాయి. పదుల సంఖ్యలో ఇల్లులు నేలమట్టం అయ్యాయి. పలు గ్రామాలను వరద నీరు ముచ్చెత్తింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడిపారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించారు. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని వివరించారు. అయితే ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో మాత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.