భద్రత కల్పించాలంటూ కేంద్రానికి రాజాసింగ్ లేఖ..

rajasingh

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రానికి లేఖ రాసారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. ఉగ్రవాద సంస్థల నుంచి తమకు ప్రాణముప్పు పొంచి ఉందని, భారీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాదులో రోజురోజుకు ప్రజల భద్రత దిగజారిపోతుందని, ఇంటిలిజెన్స్ వారి నుండి అత్యంత విశ్వసనీయ సమాచారం ఒకటి తనకు వరకు వచ్చిందని లేఖలో ఆయన అన్నారు. ఆ సమాచారంలో తనను, తన కుటుంబాన్ని సూసైడ్ బాంబు ద్వారా చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందని ఆరోపించారు. తెలంగాణ నిఘవర్గాలు ఎలాంటి క్రిటికల్ సమాచారం తనకు చెప్పడం లేదని రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, వీలైనంత త్వరగా వీటిపై చర్యలు తీసుకోగలరంటూ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.

ఇప్పటికే దేశ విదేశాల నుంచి తనను చంపేస్తానంటూ అనేక బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. గతంలోనూ తన భద్రత విషయంపై మోదీ, అమిత్ షాలకు రాజాసింగ్ లేఖలు రాశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉగ్రకదలికలు బయటపడిన నేపథ్యంలో రాజాసింగ్ మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.