తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం..గతంతో కంటే ఎక్కువే

మే 13 న తెలంగాణ లో 17 స్థానాలకు సంబదించిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే ప్రచారం చేసారు. కాగా ఓటర్లు కూడా అంతే స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 65.67 శాతంగా పోలింగ్ నమోదైంది. మొత్తం 3,32,32,318 మంది ఓటర్లకు 2,20,24,806 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 62.77శాతం నమోదుకాగా ఈసారి 2.90 శాతం ఓటింగ్‌ పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ర్టాల వారు స్వస్థలాలకు వెళ్లినా ఇక్కడివారు ఓటేసేందుకు ఉత్సాహంగా ముందుకు రావడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో గతం కంటే ఎక్కువగానే ఓటింగ్‌ జరిగింది. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా చూస్తే 76.68 శాతంతో భువనగిరి మొదటి, 76.09 శాతంతో ఖమ్మం రెండో స్థానంలో నిలిచాయి. ఇక అతి తక్కువగా హైదరాబాద్‌లో 48.48 శాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మల్కాజ్‌గిరిలో 19.19 లక్షల ఓట్లు, చేవెళ్లలో 16.57 లక్షల ఓట్లు పోలయ్యాయి. అతి తక్కువగా సికింద్రాబాద్‌లో 10.39 లక్షల ఓట్లే పడ్డాయి.