ప్రియాంక గాంధీ కూతురుపై పోస్టు..కేసు నమోదు

Post on Priyanka Gandhi’s daughter..Case registered

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూతురు మిరయా గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేసిన వ్యక్తిపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రమోద్ గుప్తా ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు అనూప్ వర్మ అనే నెటిజన్ మిరయా గాంధీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆమె పేరు మీద రూ.3 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ట్వీట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అధారాల్లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని, ట్వీట్ చేసిన అనూప్ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరయా గాంధీపై ట్వీట్ చేసిన అనూప్ వర్మ ఐడీని పరిశీలించామని, ఆయన ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్, డిఫెన్స్ అనలిస్టునని ట్విట్టర్ ఖాతాలో చెప్పుకున్నాడని వివరించారు. అనూప్ వర్మను గుర్తించేందుకు సైబర్ సెల్ సాయం కోరినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయడం, ఇతరుల గౌరవాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడం నేరమని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.