బతుకమ్మ చీరలకు 351.52 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

బతుకమ్మ చీరల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 352 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని నిరుపేద ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

18 ఏండ్లు నిండిన ప్రతి స్త్రీకి చీరలను పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో సగటున ప్రతి సంవత్సరం కోటి మందికిపైగా ఆడబిడ్డలకు లబ్ధి చేకూరుతున్నది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో మొత్తంగా రూ.400 కోట్లను ప్రతిపాదించింది. ఆ నిధుల్లో రూ.351.52 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందించే ఉద్దేశ్యంతో 2017లో బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకను అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనలోంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది. మొదట్లో 30 డిజైన్ల చీరలతో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ 225 డిజైన్లకు చేరుకుంది. బతుకమ్మ చీరల ఆర్డర్‌తో ఒక్కో చేనేత కార్మికుడికి సగటున రూ.20 వేలు సంపాదన సమకూరుతోంది.