హెచ్‌సీక్యూ వల్ల వైరస్‌కు మంచి ఫలితాలు

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడి

hydroxychloroquine
hydroxychloroquine

న్యూఢిలీ: హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) మాత్రల వల్ల కరోనా ముప్పు తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరోమారు స్పష్టం చేసింది. యాంటీ మలేరియా ఔషధమైన హెస్‌సీక్యూ వాడకం వల్ల వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది వైరస్ బారినపడడం తగ్గిందని పేర్కొంది. నాలుగు కంటే ఎక్కువ డోసులు తీసుకోవడం వల్ల వైరస్ సోకే ముప్పు గణనీయంగా తగ్గినట్టు వివరించింది. ఇందుకు సంబంధించిన పరిశోధన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్గ (ఐజేఎంఆర్)లో ప్రచురితమయ్యాయి. హెచ్‌సీక్యూ వాడకం వల్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో హెచ్‌సీక్యూ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఐసీఆర్ అధ్యయన ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ అధ్యయనంపై పరిశోధకులు మాట్లాడుతూ.. హెచ్‌సీక్యూ ఔషధం ఒక్కదాన్ని తీసుకుంటే సరిపోదని, వాటితోపాటు పీపీఈ కిట్లు కూడా వాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే, కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్న వారిలో మాత్రం ఎలాంటి ఫలితం కనిపించలేదని, అంతేకాక, ప్రాణాపాయం కూడా ఉందన్నారు. వైరస్ బారినపడకుండా మాత్రమే ఈ ఔషధం ఆపగలదని స్పష్టం చేశారు. అయితే, వైరస్ ముందే శరీరంలోకి ప్రవేశించి ఉంటే మాత్రం హెచ్‌సీక్యూ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ ఔషధాన్ని వాడడం వల్ల కొద్దిమందిలో మాత్రమే వికారం, వాంతులు, విరేచనాలు వంటి దుష్పరిణామాలు తలెత్తాయని, ఎవరిలోనూ గుండె సంబంధిత సమస్యలు మాత్రం కనిపించలేదని అధ్యయనకారులు తెలిపారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/