తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భవ వేడుకలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికీ 8 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భవ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ రెండో తేదీన భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిదో ఏట అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అన్ని పార్టీల నేతలు , సినీ ప్రముఖులు, బిజినెస్ రంగం వారు , క్రీడా కారులు ఇలా అంత కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఆవిర్భవ వేడుకలు జరుగుతున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా రాష్ట్రావతరణ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. కొద్దీ సేపటి క్రితం గన్ పార్క్​లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకొని వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించి.. పబ్లిక్ గార్డెన్స్ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రసంగం అనంతరం అంతర్జాతీయ క్రీడల్లో అద్భుతంగా రాణించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణులు నికత్ జరీన్, ఈషా సింగ్‌లను వేదికపై సన్మానించడంతో పాటు నగదు పురస్కారాన్ని అందించనున్నారు.