కవితకు జూలై 3వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Liquor policy case..Extension of Kavitha judicial remand
Kavitha judicial custody extended till July 3

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది నీతీష్ రాణా తన వాదనలను వినిపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు.

ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు.

మరోవైపు కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్‌, కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా. మార్చి 26 నుంచి కవిత తిహార్‌ జైలులో ఉన్నారు.