నేడు తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల..!

Congress

హైదరాబాద్‌ః రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వగా.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 8న మొదలైంది. రేపటితో గడువు ముగియనుంది. ఈ నెల 27వ తేదీన ఎన్నిక‌లు జరగనున్నాయి. శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాల ప్రకారం చూస్తే రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బిఆర్ఎస్‌కు దక్కనున్నాయి. రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ నామినేషన్లు వేసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. ఏఐసీసీ కోటా కింద పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. రెండో సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ కనిపిస్తోంది.

ప్రధానంగా ఒకటి ఓసీ సామాజికవర్గం, మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంతోపాటు ఏఐసీసీ భావిస్తోంది. అజయ్‌ మాకెన్‌ ఏసీ కావడంతో.. రాజ్యసభ ఆశిస్తున్నజానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరిలకు అవకాశం మిస్ అయినట్టే. ఇక రెండో సీటు కోసం బీసీ, ఎస్టీ రాజ్యసభ ఆశిస్తున్న వారిలో బలరాం నాయక్‌, వి. హనుమంత రావుతోపాటు జి. నిరంజన్‌ సహా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వీహెచ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ సాయంత్రంలోపు రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.