ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జ‌గ‌న్‌

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం జగన్ పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం జ‌గ‌న్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది ముస్లిం సోద‌రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదర సోద‌రీమ‌ణులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రంజాన్ ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సూచించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకోలేదని అంజాద్ బాషా విమర్శించారు. మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు.

ఇక ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.