టీకాంగ్రెస్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్‌

రేవంత్ వర్గానికి భారీ షాక్ ..టీకాంగ్రెస్‌ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ తప్పుకున్నారు. గత కొద్దీ నెలలుగా టి కాంగ్రెస్ లో సీనియర్లకు రేవంత్ కు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య నేరుగా మీడియా ముందుకు వచ్చి సీనియర్ నేతలు రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే మాణిక్కం ఠాగూర్‌ ఫై కూడా నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌ రేవంత్ వర్గానికే సపోర్ట్ గా ఉంటున్నారని , సీనియర్ల మాటలను పట్టించుకోవడం లేదని , మా బాధలను అధిష్టానానికి తెలియ జేయడం లేదని వారంతా వాపోయారు.

ఈ క్రమంలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి… కాంగ్రెస్ ముఖ్య నేతలతో విడి విడిగా సమావేశమయ్యారు. ఎవరూ గొడవ పడకూడదని.. ఏవైనా సమస్యలు ఉంటే.. కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. అనంతరం ఇక్కడి పరిస్థితులపై హైకమాండ్‌కు నివేదిక అందించారు. ఇక ఇప్పుడు ఎవరు బయటకు ఏమి మాట్లాడకపోయినా లోలోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ తప్పుకున్నారు. ఈరోజు అవగాహన సదస్సు జరిగిన అనంతరం.. ఆయన టి.కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు అంటూ ఆఖరి మెసేజ్ పెట్టిన ఠాగూర్.. ఆ తరువాత అన్ని గ్రూప్‌లనుంచి లెఫ్ట్ అయ్యారు. కానీ ఇంచార్జి పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.