నా నియోజకవర్గంలో నన్ను అడ్డుకుంటారా..? అంటూ చంద్రబాబు ఫైర్

చంద్రబాబు కుప్పం పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం పట్ల ఫైర్ అయ్యారు. నా సొంత నియోజకవర్గం లో పర్యటించకుండా, ర్యాలీ నిర్వహించకుండా, సభ పెట్టకుండా అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం దయాదాక్షిణ్యాలతో సభలు నిర్వహించాలని అనుకుంటున్నారు.. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడాలా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం.. రోడ్లపై తిరిగే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. తన రోడ్‌షోను అడ్డుకునేందుకే కొత్త జీవో తీసుకొచ్చారని బాబు ఫైర్ అయ్యారు.

తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని… టీడీపీ సభలకు ప్రజలు పోటెత్తుతున్నారని… అందుకే భయపడి చీకటి జీవో తీసుకొచ్చారని అన్నారు. నిన్న జగన్ సభకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చి, వాటి బస్సుల్లో జనాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. పెన్షన్ కట్ చేస్తామని బెదిరించి మహిళలను బలవంతంగా తరలించారని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు. పోలీసులు కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాలని అన్నారు. జగన్ నియంతగా మారారని… ఆయన పాలన పోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తాము ఇలాంటి ఆంక్షలు పెట్టివుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.