తెలంగాణ సీఎం ఎవరనేది..ఈరోజు తెలియనుంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించినప్పటికీ , సీఎం ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్సు లోనే ఉంది. నిన్నంతా చర్చలు జరిపిన కొలిక్కి రాలేదు. దీంతో అధిష్టానం ఢిల్లీకి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్‌, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు.

ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్‌ చేస్తుందా లేదా అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించే బాధ్యతను అధిష్టానానికి ఇచ్చారు. దీంతో సీన్‌ ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటి కి వచ్చింది. ఎమ్మెల్యేల మీటింగ్ నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ ఈరోజు ఢిల్లీ కి పయనం అవుతున్నారు. మరి అధిష్టానం ఎవర్ని సీఎం గా చేస్తుందో చూడాలి.