ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఎన్జీటీ తీర్పును ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

backlash-for-ap-government-in-supreme-court

న్యూఢిల్లీః ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో నిబంధలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తున్నారంటూ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించింది. దీంతో ఎన్జీటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఎన్జీటీ తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అయితే ఎన్జీటీ విధించిన రూ. 18 కోట్ల జరిమానాపై మాత్రం స్టే విధించింది.

ఇసుక తవ్వకాలను జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ కు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను చేపడుతున్నారని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తవ్వకాలపై నిషేధం విధించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. నదీ తీరాలు, రివర్ బెడ్లలో భారీ యంత్రాలతో తవ్వకాలను అనుమతించడంపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.