బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం

telangana-cabinet-approves-vote-on-account-budget

హైదరాబాద్‌: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రూపొందించింది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడుతారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ ప్రతిపాదనలను చదవనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమవేశమైన రాష్ట్ర మంత్రిమండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కాగా, ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. అయితే ఇది గత బడ్జెట్‌ కంటే 20 వేల కోట్లు తక్కువ.

ఈ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తున్నది. ఏటా సాధారణంగా జరిగే.. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం మళ్లీ జూన్‌ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.