వర్ధన్న పేట ఫుడ్ పాయిజన్‌ : వార్డెన్, కుక్‌ మాస్టర్ సస్పెన్షన్‌

వరంగల్‌ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్‌పాయిజన్‌ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా వార్డెన్, కుక్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కాగా, అంతకుముందు సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్రిజన బాలికల హాస్టల్‌ను సందర్శించి ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపారు.

గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆశ్రమాలలో , కాలేజీ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పటల్ పాలవ్వగా..తాజాగా వరంగల్‌ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్‌పాయిజన్‌ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్‌ అన్నంలోని బల్లిని తీసివేశాడు. ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్‌ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు , విద్యార్థుల సంఘాలు , విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.