ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌ కోసం రూ.1,463 కోట్లు

telangana-budget-2023-live-updates

హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్‌ను హ‌రీశ్‌రావు చ‌దివి వినిపిస్తున్నారు.

ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌ కోసం రూ.1,463 కోట్లు

ఫారెస్ట్‌ కాలేజీకి రూ. 100 కోట్లు
కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ రూ. 200 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్లకు రూ. 400 కోట్లు
ఆలయాల కోసం రూ. 250 కోట్లు
మిషన్‌ భగీరథకు రూ. 600 కోట్లు
మిషన్ భగీరథ అర్భన్‌ రూ. 900 కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం రూ. 1500 కోట్లు
ఎప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ కోసం రూ. 362 కోట్లు
ఆరోగ్య శ్రీ కోసం రూ. 1,101 కోట్లు

ఆభివృద్ధి పథంలో తెలంగాణ

2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదు అవుతుంది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతానికి కావడం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్నది. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతానికి జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది.

ప్రతిష్టాత్మకంగా బుద్ధవనం నిర్మాణం

ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనాన్ని అద్భుతంగా నిర్మించింది. 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును రూ.71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకొన్న ఈ ప్రాజెక్టు.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను.. ఇతర పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.

పూర్తయిన 350 వంతెనల నిర్మాణం..

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.2,727 కోట్లతో 1875 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో 1684 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. రూ. 3,134 కోట్ల ఖర్చుతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో 350 వంతెనల నిర్మాణం పూర్తయింది.

రూ. 1,581 కోట్ల 29 జిల్లాల్లో కలెక్టరేట్లు..

రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో రూ. 1581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాలకన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

కాలంతో పోటీ పడుతూ కొత్త సచివాలయాన్ని నిర్మించాం

తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సెక్రటేరియట్‌ భవనానికి ప్రభుత్వం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 7 అంతస్తుల సచివాలయ భవనం నిర్మాణం పూర్తయింది. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రానికే గర్వకారణమైన సెక్రటేరియట్‌ భవనాన్ని కాలంతో పోటీ పడుతూ వేగంగా నిర్మింపజేసిన అధికారులకు, ఇంజినీర్లకు, కార్మికులకు అభినందనలు.