వైస్సార్సీపీ నేత‌ల‌కు లోకేశ్ వార్నింగ్

అధికారంలోకి వ‌చ్చాక ఒక్కొక్క‌డి అంతు చూస్తా’ .. లోకేశ్

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైస్సార్సీపీ నేత‌ల‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక ఒక్కొక్క‌డి అంతు చూస్తాన‌ని హెచ్చ‌రించారు. త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు లోకేశ్‌కు చెప్ప‌గా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి అనంతపురం చేరుకున్న ఆయ‌న.. గాయపడిన ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ విద్యార్థులను పరామర్శించారు. అంత‌కుముందు అనంతపురం వెళుతున్న నారా లోకేశ్‌ కు మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని ఆవేద‌న చెందారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్‌ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ‘నా మీద కూడా 11 కేసులు పెట్టారు. ఏం చేయ‌గ‌ల‌రు? ఇంకో కేసు పెడితే 12 కేసులు అవుతాయి.. అంతే.. రేపు అధికారం లోకి రాగానే ఒక్కొక్క‌డి అంతు నేను చూస్తా’ అని హెచ్చ‌రించారు. ఈ వీడియోను టీడీపీ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అనంత‌పురంలో విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులతో ఎయిడెడ్ కాలేజీల విలీనంపై లోకేశ్ ముఖాముఖిలో మాట్లాడుతున్నారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరించటం వల్ల ఫీజుల భారంపై విద్యార్థుల అభిప్రాయాలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలు కూడా ఇందులో పాల్గొంటున్నారు.

ఎయిడెడ్ కాలేజీల విలీనం నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిన్న విద్యార్థులు ఆందోళ‌ణ చేయ‌గా వారిపై పోలీసులు లాఠీచార్జీ చేయ‌డంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో ప‌లువురు విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. వారితో మాట్లాడి లోకేశ్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌ను టీడీపీతో పాటు జ‌న‌సేన‌, వామ‌ప‌క్ష పార్టీలు ఖండిస్తున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/