తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా

Telangana assembly session adjourned to Monday

హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాల‌కు గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించ‌బోతున్నామ‌ని ఆర్థిక భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ నిర్ణ‌యం జ‌రిగింద‌న్నారు. దాని అమ‌లుకు కావాల్సిన స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు బ‌డ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ. 16,825 కోట్లు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు భ‌ట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను అందించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. అంత‌కుముందు ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శాస‌న‌స‌భ‌లో ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభ‌మైన భ‌ట్టి ప్ర‌సంగం మ‌ధ్యాహ్నం 1:20 గంట‌ల‌కు ముగిసింది. అనంత‌రం స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2,75,891 కోట్ల‌తో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు.