మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారులు చెప్పిన లెక్క ఇది

Malla Reddy
Malla Reddy

రెండు రోజులపాటు మంత్రి మల్లారెడ్డి ఇల్లు , ఆఫీస్ ల ఫై జరిపినా దాడుల్లో దాదాపు రూ. 8 కోట్ల నగదు లభ్యం అయినట్లు అధికారులు తెలిపారు. భూ కొనుగోళ్లు – అమ్మకాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, మేనేజ్‌మెంట్‌ కోటా కింద మెడికల్ సీట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా అధికారులు ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల్లో మొత్తం రూ. 8కోట్లు 80 స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్క రోజే ఐటీ సోదాల్లో రూ. 4కోట్లు 80 లక్షలు స్వాధీనం చేసుకోగా.. త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు 80 లక్షలు, మర్రి రాజశేఖర్‌ రెడ్డి రూ. 2 కోట్లు లభించాయి. మంత్రి మల్లారెడ్డి భార్య తమ్ముడి కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ. 4కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతోపాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల ఈ రాత్రికి ముగియనుండగా, ఇంకొన్ని చోట్ల రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఐటీ అధికారులు మాట్లాడుతూ.. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్టు గుర్తించినట్టు చెప్పారు. లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చిస్తున్నట్టు ఆధారాలు సేకరించామన్నారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువకు తక్కువగా చూపించారని అన్నారు.