నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు. అదే రోజు (9న) ప్రభుత్వం ధన్యవాదాల తీర్మానానికి సమాధానమిస్తుంది. కాగా.. 10వ తేదీన (శనివారం) ప్రభుత్వం శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

11న ఆదివారం శాసన సభకు సెలవు ప్రకటించి, బడ్జెట్‌పై సభ్యులకు అధ్యయనం చేసే అవకాశమిస్తారని తెలిసింది. తిరిగి 12న అసెంబ్లీ ప్రారంభమయ్యాక బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చ ఎన్ని రోజులపాటు జరిగేదీ శాసన సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలుస్తుంది.