తెలంగాణ పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేసాయి. ఈ ఫ‌లితాల‌ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుద‌ల చేశారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాల్లో 80.59 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తం 71,695 మంది విద్యార్థులు ప‌రీక్ష ఫీజు క‌ట్ట‌గా, 66,732 మంది హాజ‌ర‌య్యారు. ఇందులో 53,777 మంది ఉత్తీర్ణ‌త సాధించారు.

ఈ ఫ‌లితాల్లో బాలిక‌లు 83.50 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 78.50 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో సిద్దిపేట జిల్లా 99.47 శాతం ఉత్తీర్ణ‌త సాధించి, రాష్ట్రంలో మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 53.69 శాతం ఉత్తీర్ణ‌తతో జ‌గిత్యాల జిల్లా చివ‌రిస్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రాకపోతే.. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లేదు. ఇలాంటి వారి కోసమే అధికారులు జోసా కౌన్సెలింగ్‌ రూపంలో ఒక అవకాశం కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌, ప్లస్‌ టూ పరీక్షల్లో ఉత్తీర్ణులై.. 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు సంపాదించవచ్చు.

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుంచి 9 వరకు నిర్వహించారు. మరోవైపు, జూన్ 14 నుంచి జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70వేల మంది విద్యార్థులు రాశారు.