ఆదిలాబాద్‌ లో 10th క్లాస్ జవాబు పత్రాలు మాయం

తెలంగాణ లో వరుస ప్రశ్న పత్రాలకు సంబదించిన లీక్ వ్యవహారం ప్రభుత్వాని తీవ్ర విమర్శల పాలుచేస్తుంది. ఇప్పటికే TSPSC పేపర్ లీక్ ఘటన సంచలనం రేపుతుండగా..నిన్న పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయో లేదో..మొదటి రోజే టెన్త్ కశ్చన్ పేపర్ లీక్ హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగానే ఈరోజు టెన్త్ ఆన్సర్ షీట్స్ మిస్సింగ్ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదోవ తరగతి ఆన్సర్ షీట్‌ల కట్ట మిస్ అయ్యింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. పోస్ట్ ఆఫీస్ నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తరలిస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ పోస్టల్ ఆఫీసర్స్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన ఫై విద్యాశాఖ స్పందించింది. ఉట్నూరు పదోవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయని తెలిపింది. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మిస్ అయినట్లు గుర్తించామన్నారు. పోస్టాఫీస్‌ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగా మిస్ అయ్యాయని, దీనికి బాధ్యులు పోస్టల్‌ అధికారులే అని అన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.