థాంక్యూ బ్రదర్ అంటూ కేటీఆర్ కు తేజశ్వి యాదవ్ ట్వీట్

బిహార్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయగా..ఉప ముఖ్యమంత్రి గా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి , టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేజస్వీ యాదవ్‌ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేసారు. . కొత్త బాధ్యతలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆంకాంక్షిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేసారు. కేటీఆర్ ట్వీట్ కు తేజశ్వి యాదవ్ రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ బ్రదర్’ అని ప్రతిస్పందించారు.

ఇక నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ‘2014లో గెలిచిన మోదీ.. 2024లో గెలువగలరా?’ అని ప్రశ్నించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై బీజేపీకి బెంగ తప్పదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని పదవికి తాను పోటీదారుగా లేనన్నారు. బీజేపీని వీడాలని తమ పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారని పునరుద్ఘాటించారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగబోదంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఈడీ, సీబీఐ కేసులకు తాను, తమ నేతలు భయపడబోమని తేల్చిచెప్పారు.