వైఎస్‌ఆర్‌సిపి ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందిః నారా లోకేశ్

చంద్రగిరి మండలంలో టిడిపి నేత మునిరత్నం నాయుడుపై దాడి

nara-lokesh

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అసహనం పెరిగిపోతోందని, ఓటమి భయంతో వారు టిడిపి నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తాజాగా చంద్రగిరి మండలం భీమవరంలో మునిరత్నం నాయుడుపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడి చేశారని ఆరోపించారు. మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మునిరత్నం నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ భరోసానిచ్చారు. వైఎస్‌ఆర్‌సిపి ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు.

ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మునిరత్నం నాయుడుపై దాడి ఘటనను ఖండించారు. టిడిపి నేత మునిరత్నం నాయుడుపై వైఎస్‌ఆర్‌సిపి గూండాలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడికి దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా టిడిపి వెనుకడుగు వేయదన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. మునిరత్నం నాయుడుపై దాడి చేసిన వైఎస్‌ఆర్‌సిపి నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.