పాక్‌లో లష్కరే మాజీ కమాండర్‌ అక్రమ్‌ ఖాన్‌ కాల్చివేత

2018 నుంచి 2020 వరకు లష్కరే రిక్రూట్‌మెంట్ సెల్‌లో చురుగ్గా పనిచేసిన ఘాజీ

Ex-Lashkar commander, known for anti-India speeches, shot dead in Pakistan

ఇస్లామాబాద్‌: భారత వ్యతిరేక ప్రసంగాలతో యువతను వెర్రెక్కించే లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్‌ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ్ ఘాజీగా అందరికీ తెలిసిన అతడిని పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 2018 నుంచి 2020 వరకు ఘాజీ లష్కరే రిక్రూట్‌మెంట్ సెల్‌లో చురుగ్గా పనిచేశాడు. తీవ్రవాద కార్యకలాపాల్లోనూ పాలుపంచుకునేవాడు.

2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఏడాది అక్టోబర్ పాకిస్థాన్‌లో కాల్చివేతకు గురయ్యాడు. పాక్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన షాహిద్.. భారత మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిం ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని అల్ ఖుదూస్ మసీదు లోపల హత్యకు గురయ్యాడు. కోట్లీ నుంచి ప్రార్థనల కోసం వచ్చిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు.