సైబరాబాద్ పరిధిలో జూలై 1 నుంచి 4 వరకు 144 సెక్షన్

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా ప్రధాని మోడీ హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ సందర్బంగా సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించారు నగర పోలీసులు. జులై 01 నుండి జులై 04 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడ వద్దని, నగరంలో డ్రోన్లను ఎగరవెయ్యొద్దని ఆదేశించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. శాంతికి విఘాతం కలగడం, ప్రజల ప్రశాంతతకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో.. గాల్లోకి ఎగరేసే పరికరాలపై నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు.

జూన్ 30వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి జులై నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది, సైనికులు, హోంగార్డులతోపాటు అంత్యక్రియల కార్యక్రమాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్,కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొననున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీజీ అధికారులు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు సమావేశం నిర్వహించారు.