పల్నాడు లో టీడీపీ నాయకుడి ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన దుండగులు

ఏపీలో రాజకీయాలు కాస్త హింసాత్మకంగా మారుతున్నాయి. రోజు రోజుకు వైస్సార్సీపీ – టీడీపీ వర్గీయుల మధ్య హింసాత్మక ఘటనలు ఎక్కువైతున్నాయి. మొన్నటికి మొన్న గన్నవరం లోని టీడీపీ ఆఫీస్ ఫై వైస్సార్సీపీ కార్య కర్తలు దాడి చేసి నానా బీబత్సం చేయగా..తాజాగా పల్నాడు లో టీడీపీ నాయకుడి ట్రాక్టర్‌కు కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు. ఈ పని చేసిని వైస్సార్సీపీ కార్యకర్తలే అని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.

పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో.. శుక్రవారం అర్ధరాత్రి టీడీపీ పార్టీ కి చెందిన బత్తుల ఆవులయ్య ట్రాక్టరుకు దుండగులు నిప్పు పెట్టారు. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది వైఎస్సార్సీపీ కార్యకర్తల పనే అని ఆరోపిస్తుంది. మిరియాల గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠను పురస్కరించుకుని.. శుక్రవారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని ఆవులయ్యకు చెందిన ట్రాక్టర్‌పై ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమం తర్వాత.. ట్రాక్టరును చెరువు కట్ట వద్ద నిలిపి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో.. కొందరు వైస్సార్సీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితుడు ఆరోపించారు. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ట్రాక్టర్‌ పూర్తిగా కాలిపోయిందని ఆవులయ్య చెప్పుకొచ్చారు.

ఈ ఘటన ఫై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘వీళ్లసలు మనుషులేనా? ఉదయం లేచింది మొదలు తగలబెట్టడం.. పగలగొట్టడం.. ఇదే పనా? వైస్సార్సీపీ సైకోలకు కళ్ల ముందు భవిష్యత్ ఓటమి కనిపించడమే ఈ ఫ్రస్ట్రేషన్‌కు కారణం. పల్నాడులో టీడీపీ ఇంఛార్జ్‌ని ట్రాక్టర్ మీద ఊరేగింపుగా తెచ్చారని… దాన్ని తగలబెట్టడం నీచమైన చర్య’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.