ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో నాల్గు అంతర్జాతీయ అవార్డులు

ఆర్ఆర్ఆర్ ఖాతాలో అవార్డ్స్ వచ్చిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ తన ఖాతాలో వేసుకోగా…తాజాగా మరో నాల్గు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా నటించగా అజయ్ దేవగన్ , శ్రీయ వంటి వారే కాకుండా హాలీవుడ్ నటి నటులు సైతం నటించారు. మార్చి 24 , 2022 లో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం వసూళ్లే కాదు ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది. రీసెంట్ గా ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది.

తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. కానీ వాటిలో నిరాశే ఎదురైంది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు గెలుచుకోవడం గమనార్హం.