అదానీ, అంబానీ కంటే నా సమయమే విలువైంది.. బాబా రామ్‌దేవ్‌

సాధుసన్యాసులు సమాజ శ్రేయస్సు కోసమే కాలం గడుపుతారని వెల్లడి

value-of-my-time-more-than-adani-ambani-tata-birla-says-baba-ramdev

గోవా: వేల కోట్లకు అధిపతులైన వ్యాపారవేత్తలు సమయాన్ని డబ్బుతో లెక్కిస్తారని యోగా గురు బాబా రాందేవ్ పేర్కొన్నారు. అయితే, అంబానీ, అదానీ, టాటా, బిర్లాల సమయం కన్నా తన సమయమే విలువైందని చెప్పారు. ఓ వ్యాపారవేత్త తన టైంలో 99 శాతం కాలాన్ని తన కోసమే వెచ్చిస్తాడని చెప్పారు. ఓ సాధువు మాత్రం పూర్తి సమయాన్ని సమాజ శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తాడని బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఈమేరకు గోవాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో బాబా రాందేవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిద్వార్ నుంచి తాను మూడు రోజుల పర్యటన కోసం గోవాకు వచ్చినట్లు తెలిపారు. కాలం విలువైందని, మిగతా వారితో పోలిస్తే ఓ సాధువు, సన్యాసి కాలానికే విలువ ఎక్కువని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో పతంజలి కంపెనీ సీఈవో, తన సహచరుడు ఆచార్య బాలకృష్ణను సన్మానించారు. మూతపడే స్థితిలోని పతంజలి కంపెనీని రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించేలా డెవలప్ చేశారని ఆచార్య బాలకృష్ణపై బాబా రాందేవ్ ప్రశంసలు గుప్పించారు.