లోకేష్ అరికాలి బొబ్బల్ని తల్చుకుని జేసీ భావోద్వేగంతో కన్నీరు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత రెండు నెలలుగా యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అనంతపురం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి , కర్నూల్ జిల్లాలో అడుగుపెట్టారు. కాగా లోకేష్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.

ప్రజల కోసం, రాష్ట్రం కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని జేసీ తెలిపారు. లోకేష్ అరికాలి బొబ్బల్ని తల్చుకుని జేసీ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. లోకేష్ కర్మజీవి అని, ఆయన పగిలిన కాళ్లను చూస్తుంటే తనకే ఇలా ఉంటే ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ తల్లితండ్రులు, సతీమణికి చేతులెత్తి మొక్కుతున్నానన్నారు.

తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి రెండు రోజులు పాదయాత్రలో నడిస్తేనే కాళ్ల నొప్పులు వచ్చాయని, అలాంటిది ప్రజల కోసం లోకేష్ వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ ను చూసినట్లుగా జనం లోకేష్ ను చూస్తున్నారన్నారు. ఏపీ బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని జేసీ తెలిపారు.