ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయిః అయ్యన్న

విచారణ జరిపించాలని విశాఖ కలెక్టర్ కు వినతిపత్రం

ayyanna patrudu
ayyanna patrudu

అమరావతిః ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లు చేర్చారంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే ముసాయిదా జాబితాలో 16 వేలమంది అనర్హుల పేర్లను గుర్తించినట్లు వెల్లడించారు. దీనిపై సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వెళ్లి ముసాయిదా జాబితాలో అవకతవకలు, అనర్హులకు ఓటు కల్పించడంపై కలెక్టర్ కు ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో డిగ్రీ పాస్ అయినవాళ్లు అర్హులని, వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పారు. అయితే, తాజా ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాలో ఇంటర్ పాస్ అయిన వాళ్ల పేర్లతో పాటు ఫెయిల్ అయిన వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అయ్యన్నపాత్రుడు అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది ఇందుకేనా అని జగన్ సర్కారును అయ్యన్న నిలదీశారు. ఓటరు జాబితాలో అనర్హుల పేర్లను చేర్చి, వారు వేసే ఓట్లపై భరోసాతోనే 175కు 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఓటర్ జాబితాలో అవకతవకలపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పల్లా శ్రీనివాస్ లతో పాటు స్థానిక నేతలు కూడా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/