ఏళ్లు గడుస్తున్నా జగన్‌ ఆ హామీని నిలబెట్టుకోలేదుః టీడీపీ నేత జవహర్

వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారన్న జవహర్

jawahar-fires-on-jagan

అమరావతిః టిడిపి నేత, మాజీ మంత్రి జవహర్ సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారని… ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీపీఎస్ పై చర్చిద్దాం రమ్మంటూ ఉద్యోగులకు ఆహ్వానం పలకడం కేవలం కాలయాపన చేయడానికే అని మండిపడ్డారు. మూడున్నరేళ్లు ఏమార్చిన ముఖ్యమంత్రికి… మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. చర్చల పేరుతో మరో మోసానికి తెరదీశారని చెప్పారు.

ఉద్యోగ సంఘాల నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారని జవహర్ తెలిపారు. కొన్ని ఉద్యోగ సంఘాలను మాత్రమే చర్చలకు పిలుస్తున్నారని విమర్శించారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మారడం బాధాకరమని చెప్పారు. డీఏలు ఈనాటికీ జమ కాకపోవడం ఉద్యోగుల పరిస్థితికి నిదర్శనమని అన్నారు. పీఆర్సీ బకాయిల గురించి ఉద్యోగులు పోరాడాలని… పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/