నేడు టీడీపీ , జనసేన రెండో జాబితా రిలీజ్..

TDP-Janasena first list released

అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన రెండో జాబితాను టీడీపీ , జనసేన పార్టీ లు ఈరోజు రిలీజ్ చేయబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు దాదాపు వందకుపైగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పుడు మరో విడతలో 20 నుంచి 30 మంది అసెంబ్లీ, పది మంది పార్లమెంట్ సభ్యుల జాబితాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. టీడీపీ 25 మంది అసెంబ్లీ అభ్యర్థులతోపాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. టీడీపీ ఇప్పటికే 94 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 31 స్థానాలు కేటాయించగా మిగిలిన 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినందున ఇంకా 50 మంది పేర్లు రివీల్ చేయాల్సి ఉంది. అందులో ఈరోజు 25 మంది ని ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఇటు జనసేన ధినేత కూడా 10 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ఖరారు చేసారు. నిన్న పార్టీ ఆఫీస్ కు వారిని పిలిపించి మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు (ఎస్సీ)లో మాజీ ఐఏఎస్‌ అధికారి వరప్రసాద్‌ పేరు ఖరారైంది. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్‌, పెందుర్తిలో పంచకర్ల రమేశ్‌బాబు, యలమంచిలిలో సుందరాపు విజయ్‌కుమార్‌ అభ్యర్థిత్వాలను ఆమోదించినట్లు సమాచారం. ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాస్‌, భీమవరం-పులపర్తి రామాంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్‌లను ఖరారు చేశారు. పిఠాపురంలో పవన్‌ పోటీ ఖాయమైనట్లే. తిరుపతి సీటుపై ఆయన బాగా తర్జనభర్జన పడ్డారు. చివరకు ఇటీవల జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైపు పవన్‌ మొగ్గుచూపారు.