సజ్జల సెటిల్మెంట్లతో YCPకి నిధులు – అచ్చెన్నాయుడు

పైరవీలు, సెటిల్మెంట్లతో డబ్బులు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చడానికే సజ్జల రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి రూ.వెయ్యి కోట్లు సజ్జల వసూలు చేశారన్నారు. చిలకలూరిపేట ఇన్ఛార్జ్ గా రాజేశ్ నాయుడిని నియమించడానికి మంత్రి రజనీ, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటన్నారు.

దీనికి సంబంధించి మంత్రి రజని, సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో గెలవొచ్చని పగటి కలలు కంటున్నారని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు. ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ, మరోవైపు అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.