ఈ నెల 5వ తేదీ నుంచి ‘రా… కదలిరా’..జనంలోకి టిడిపి అధినేత

5వ తేదీ నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగసభలు

tdp-chief-chandrababu-meetings-will-be-commenced-from-jan-5

అమరావతిః ఈ నెల 5వ తేదీ నుంచి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి ‘రా… కదలిరా’ పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది.

ఇవాళ మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు రా… కదలి రా… కార్యక్రమ షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రోజుకి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు.

ప్రతి సభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్నా, సమయా భావం వల్ల కొన్నిప్రాంతాలకే పరిమితమయ్యారని పేర్కొన్నారు.

“సభలకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నాం. 1982లో టిడిపి ఆవిర్భవించక ముందు ఉన్న పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే, మరలా రాష్ట్రానికి కొత్త ఊపిరి రావాలంటే, చంద్రబాబునాయుడి నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

కర్షకులు, కార్మికులు, మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు, శ్రామికులు ఇలా అందరూ ఆనందంగా బతకాలంటే అది చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం టిడిపితోనే సాధ్యం. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టిడిపి-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండుపార్టీల కలయికను, అవి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు” అని అచ్చెన్నాయుడు వివరించారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభల వివరాలు…

జనవరి 5: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో సభ
జనవరి 6: విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట.
జనవరి 9: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ.
జనవరి 10: విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని.
జనవరి 18: తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్థంతి నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీస్థాయిలో సభ
జనవరి 19: చిత్తూరు పార్లెమంట్ పరిధిలోని జీడీ నెల్లూరు, కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం
జనవరి 20: అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట.
జనవరి 24: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండలో సభ
జనవరి 25: నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో.
జనవరి 27: రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో.
జనవరి 28: అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో..
జనవరి 29: ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు

కాగా… టిడిపి – జనసేన కలిసే సభల్ని నిర్వహిస్తున్నాయని, చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. టిడిపి చేపట్టబోయే కార్యక్రమాలు, చంద్రబాబునాయుడి సభలకు భారీగా తరలి వచ్చి వాటిని విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతున్నామని పిలుపునిచ్చారు.