వాట్సాప్‌ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి

హర్షం వ్యక్తం చేసిన జుకర్ బర్గ్

వాట్సాప్‌ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి
whatsapp-pay-in-india

న్యూఢిల్లీ: వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌. యూజర్లను అమితంగా ఆకట్టుకున్న వాట్సప్‌ తాాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే చాలా యాప్‌లు డబ్బులు పంపుకోవడానికి వీలుగా ఫీచర్లను తీసుకొచ్చినట్లే వాట్సప్ కూడా ఆ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్‌లో వాట్సప్ ను దాదాపు స్మార్ట్‌ఫోను ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. దాని గురించి తెలియని యూజర్లు లేరు.

పేమెంట్స్ ఫీచర్‌ను కూడా ఆ యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో దీని ద్వారానే నగదు రహిత లావాదేవీలు చేసుకునే ఛాన్స్ ఉంది. వాట్సప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాట్సప్ ఆ దిశగా ముందడుగు వేసింది. దశల వారీగా వాట్సప్‌లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా తెలపడంతో దీనిపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ హర్షం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వీడియో రూపంలో తెలిపారు. భారత్‌లో యూపీఐ వ్యవస్థపై ఆయన ప్రశంసలు కురిపించారు. యూపీఐతో భారత్‌ ప్రత్యేకత సాధించిందని చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు.

ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన తొలి దేశం భారతేనని అన్నారు. తాము కూడా ఈ సేవల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని, డిజిటల్‌ ఇండియాకు తమ వంతు సహకారం అందించే అవకాశం వచ్చిందని తెలిపారు. వాట్సప్‌ ద్వారా డబ్బు పంపించడం, మెసేజ్ లు పంపించినంత సులభతరమని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయట్లేదని చెప్పారు. 140కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పేమెంట్స్‌ జరుపుకోవచ్చని తెలిపారు. యూజర్లకు ఈ విషయంలో మరింత భద్రత కల్పించేలా త్వరలోనే వాట్సప్‌ యూపీఐని తీసుకురానున్నామని తెలిపారు. మొదట దేశంలో రెండు కోట్ల మంది వాట్సప్‌ యూజర్లకు ఈ సేవలు అందనున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/