ఐఎంఎఫ్ లో గీతా గోపీనాథ్ కు కీలక పదవి

ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంపిక

వాషింగ్టన్: ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) సంస్థ టాప్ 2 పదవికి భారత సంతతి ఆర్థికవేత్త గీతాగోపీనాథ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గా ఉన్న గీతా గోపీనాథ్.. వచ్చే నెలలో ‘ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్’గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఎఫ్డీఎండీ జాఫ్రీ ఒకమోటో.. వచ్చే ఏడాది జనవరిలో పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఆ పోస్టుకు గీతా గోపీనాథ్ ను ఎంపిక చేశారు. జాఫ్రీ, గీత అద్భుతమైన అధికారులని, జాఫ్రీ వెళ్లిపోవడం బాధిస్తోందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా చెప్పారు. గీత ఇక్కడే ఉండి కొత్త పదవిని చేపట్టేందుకు అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో అకడమిక్ పొజిషన్ కు వెళ్లాల్సి ఉంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆమె తన మేధస్సు, నాయకత్వ పటిమతో ప్రపంచ ఎకానమీకి సాయం చేశారని జార్జివా కొనియాడారు. ఎన్నో అంశాల మీద ఆమె అవిరళంగా కృషి చేశారని ప్రశంసించారు. ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలి మహిళ ఆర్థికవేత్తగానూ పేరు సంపాదించుకున్నారన్నారు. ఈ పదవికి గీతా గోపీనాథ్ సరైన వ్యక్తి అని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇంత పెద్ద బాధ్యతను తన భుజాలపై పెట్టిన ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనాకు గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/