పోలీసులే బెదిరింపులకు దిగడం బాధాకరం..చంద్రబాబు

చట్టాన్ని మీరి జగన్ కు బానిసలుగా మారారని విమర్శలు

అమరావతి: టిడిపి మద్దతుదారులను నామినేషన్లు వెనక్కి తీసుకోవాలంటూ పోలీసులే బెదిరిస్తుండడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు బెదిరింపులకు దిగడం బాధాకరమని పేర్కొన్నారు. నంద్యాలపల్లి పంచాయతీ పరిధిలో టిడిపి కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డి టిడిపి మద్దతుదారులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంటే, కొందరు పోలీసులు బానిసలుగా మారి చట్టాన్ని అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా పోలీసు వ్యవస్థ ఔన్నత్యానికి భంగం కలిగించే విధంగా దుష్టులకు అండగా నిలిచేవారిని ప్రజలు ఉపేక్షించబోరని హెచ్చరించారు. టిడిపి నేతలు, కార్యకర్తలు మనోధైర్యం వీడరాదని, వైఎస్‌ఆర్‌సిపి అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/