బిఆర్ఎస్ పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తాటికొండ రాజయ్య

Tatikonda Rajaiah resigns from BRS party

హైదరాబాద్‌ః శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై డీలా పడిన బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్యకు కెసిఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు.

ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం… రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే సీఎంను కలిశామని వీరు చెపుతున్నప్పటికీ… వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది.