మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న – చంద్రబాబు

నందమూరి తారకరత్న మరణం ఫై టీడీపీ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. 23 రోజులుగా తారకరత్న మృత్యువుతో పోరాడి ఓడాడు అని చంద్రబాబు పేర్కొన్నారు. 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి తారకరత్న కు చికిత్స అందజేస్తూ వస్తున్నారు. తారకరత్న క్షేమంగా తిరిగిరావాలని యావత్ నందమూరి అభిమానులు , ప్రజలు కోరుకుంటూ దేవుడ్ని ప్రార్ధించారు. కానీ దేవుడు కనికరించలేదు. మహాశివరాత్రి నాడే తారకరత్న ను తనదగ్గరికి తీసుకెళ్లాడు.

నందమూరి నట వారసుల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి తరుపున బరిలోకి దిగుతారని అంత భావించారు. కానీ ఇలా మరణిస్తాడని ఎవరు ఊహించలేదు. అయితే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఇలా శివరాత్రి నాడు శివైక్యం చెందడం సంభవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

నందమూరి తారకరత్న మరణవార్త ఎంతో బాధను కలిగించిందని చంద్రబాబు అన్నారు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని తీవ్ర విచారన్ని వ్యక్తం చేశారు. “23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, చివరికి మాకు దూరమై మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

నందమూరి తారకరత్న మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. “నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నాను” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. తారకరత్న మృతి నేపథ్యంలో లోకేష్ యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. తార‌క‌ర‌త్న‌కి నివాళులు అర్పించేందుకు లోకేశ్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజవకర్గంలో కొనసాగుతోంది.